BJP MP Etela Letter To CM Revanth Over Musi Issue : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా తాను కొట్లాడే వ్యక్తినని లేఖలో పేర్కొన్నారు. హైడ్రా సంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి తాను వ్యతిరేకం కాదన్నారు.
చెరువు కన్నతల్లి లాంటిదని కానీ హైదరాబాద్‌లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులు, చేపలకు నిలయంలా లేదన్నారు. పదేళ్లున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని విమర్శించారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమని, పట్టాభూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గం అన్నారు. బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా, మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు : డీపీఆర్ ఉందా చెప్పాలన్నారు. ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి, కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లు తీసుకొని డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తా అంటే ఎలా అన్నారు. సబర్మతి నది ప్రక్షాళనకి 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కు 12 ఏళ్లలో రూ.22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతాయో చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.