Malkajgiri MP Etela Rajender Meet to Amit Shah :బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షాను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో షాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈటల రాజేందర్‌ను నియమించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్ఠానం ఉంది. ఇప్పటికిప్పుడు మారుస్తుందా లేక సంస్థాగత బలోపేతం తరువాత మారుస్తారా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Etela Rajender Telangana BJP President :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు దిల్లీలో ఉండి లాబీయింగ్ చేస్తుంటే పార్టీ శ్రేణుల్లో ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. మరోవైపు కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.