Mahesh Kumar Goud take Charge as PCC Chief Today : నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకుంటారు. మొదట మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్దకు ఆయన చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరువీరుల స్థూపం వద్ద మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు. రెండున్నర గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ సమక్షంలో రేవంత్ రెడ్డి వద్ద నుంచి మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటారు. అక్కడే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్‌కుమార్ గౌడ్‌కు రేవంత్ రెడ్డి అప్పగిస్తారు. అయితే ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీ అయితే వాడుతున్నారో, అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడాలని మహేశ్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు.
ఆ కుర్చీనే పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో : దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాంబర్‌లో ఉన్న ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లోకి మారుస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సభలో పార్టీ జెండాను రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ స్వీకరిస్తారు. దీంతో పూర్తి స్థాయి పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నట్లు అవుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
"ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును ప్రతి కార్యకర్తకు అందించడంలో, నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్ అవ్వడం వల్లే ఈ పదవి మహేశ్ కుమార్ గౌడ్‌కు వచ్చింది. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్ఠంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ మరింత ముందుకు వెళుతుంది. మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కేడర్ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం."- ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్