Lok Satta Party support to NDA Alliance:అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిచ్చే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి జేపీ మద్దతు ప్రకటించడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో పాటుగా నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినందుకు జయప్రకాశ్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
సంక్షేమమే పరమావధిగా: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా మన డబ్బేనని, ఎవ్వరు వారి సొంత డబ్బులు ఇవ్వటం లేదని జేపీ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పాల్గొనాలంటే కులం, అక్రమ సంపాదన తప్ప మిగిలిన ఏ అర్హత అవసరం లేదన్నారు. తాను ఉన్న వాస్తవమే చెబుతున్నానని, కానీ తనను కూడా కులం పేరుతో విమర్శిస్తున్నారని జేపీ వాపోయారు. సంక్షేమం అవసరమే కానీ సంక్షేమమే పరమావధిగా ఉండకూడదన్నారు. ఎన్టీఏ కూటమి సంక్షేమంతో పాటు అభివృద్దికి కూడా ప్రణాళికలు రచిస్తుందని, అందుకే తాను మద్దతు ఇస్తున్నానని జేపీ తెలిపారు.
మన పిల్లల భవిష్యత్ ఏంటి: ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే, ఆ దేశం, ఆ రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయమన్నారు. మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలన్నారు. సంక్షేమం అంటేనే, వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. అదే అభివృద్ది అంటే, దీర్ఘకాలికంగా సమాజంలో సంపద సృష్టి పెంచడమన్నారు. ఉపాధి, పెట్టుబడులు ప్రోత్సహించి పని చేసుకుంటూ ఎవరి కాళ్ల మీద వారు నిలబడగలరని పేర్కొన్నారు. నేడు ఎపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుందన్నారు.
రాజధానులను మార్చే అధికారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: జేపీ