KV Ramana Reddy Fires on Congress : పక్క వాళ్ల గురించి ఆలోచించకుండా, ఎంతమందినైనా తొక్కి పైకి రావాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని కామారెడ్డి శాసనసభ్యులువెంకట రమణారెడ్డివ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కేవీఆర్, రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు.
ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా గెలిస్తే అది నిజమైన గెలుపని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో ఓడిపోతానని తెలిసి, కొడంగల్‌లో ముఖ్యమంత్రి అవుతానని ప్రచారం చేసినందుకే రేవంత్ గెలిచారని, లేదంటే కొడంగల్‌లోనూ ఓడిపోయేవారన్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకతే కాంగ్రెస్‌ను గెలిపించిందని చెప్పారు. కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నప్పుడు విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్జి, ఇప్పుడు ఎందుకు ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్‌లో (Congress Joinings) చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే, ప్రస్తుత సీఎం రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు.
BJP Candidates Election Campaign : ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి జడ్పీటీసీ స్థాయిలోనే ఆలోచిస్తున్నారని, కేసీఆర్‌పై విమర్శలు తప్ప రాష్ట్ర సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, రైతలకు వ్యవసాయానికి కావాల్సిన సాగు నీరు ఎలా ఇవ్వాలి, తాగునీటి సమస్యలు ఎలా అధిగమించాలన్న శ్రద్ద రేవంత్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, ఆ డబ్బులు రైతులకు అందకుండా ఆపిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇంకా అమలు చేయలేదని అన్నారు. ఆరు గ్యారంటీలు లేవు, అసలు ఆయనకే గ్యారంటీ లేదంటూ రేవంత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.