KTR Tweet on Farmer Loan Waiver : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక ఇంకొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్నే అని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాడు రైతు సురేందర్ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు రైతు సాగర్ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆందోళన చెందారు. తన పేరిట ఉన్న రూ.లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న రూ.1.60 లక్షల రుణంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయారని తెలిపారు. ఇలా ఈ ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని ప్రశ్నించారు.