KTR Fires on CM Revanth Reddy : పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు జైళ్లో పెట్టడం లేదని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎంపై వ్యాఖ్యలు చేసిన ఆయన, తన బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ ఔషధాల కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఆరోపించారని మండిపడ్డారు. సచివాలయం కింద తాను నిజాం నగలు తవ్వుకున్నానని కట్టుకథను సృష్టించారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి సర్క్యులేట్ చేశారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ఉండి మరీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశారని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇలా పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకు జైళ్లో పెట్టరని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదన్న కేటీఆర్, ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని, తమను వేధిస్తే అధికారులను కోర్టుకు లాగుతామంటూ కేటీఆర్ హెచ్చరించారు.