KTR on Telanagna Thalli : కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తే చరిత్ర క్షమించదని, తెలంగాణ తల్లి రూపు మార్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో మానుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి మళ్లీ సరైన స్థానంలో ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ పెట్టిన విగ్రహాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి చెప్పడానికి మాత్రం కేసీఆర్‌పై కోపంతో నోరు రావడం లేదని ఆక్షేపించారు.
దీక్షాదివస్ సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ పుస్తక ప్రదర్శనను కేటీఆర్ నిర్వహించారు. కేటీఆర్‌తో పాటు పలువురు కవులు, రచయితలు, ప్రొఫెసర్లు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ చరిత్ర, గొప్పతనం శాశ్వతమని అన్నారు. వచ్చే ఏడాది నుంచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ సహా పది జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సాహిత్య పండుగలు నిర్వహిస్తామని తెలిపారు.
కాలంపై చేసిన సంతకం : తెలంగాణ ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచే కేసీఆర్ అభివృద్ధి గురించి మాట్లాడేవారని, జూన్ 2 కంటే కూడా నవంబర్ 29, డిసెంబర్ 9 తెలంగాణకు ప్రాముఖ్యమైన రోజులని కేటీఆర్ పేర్కొన్నారు. చెరిపి వేయడానికి కేసీఆర్ కాగితంపై చేసిన సంతకం కాదని, కాలంపై చేసిన సంతకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ పదవి తీసుకున్నా తెలంగాణ కోసమే, పదవి వదులుకున్నా తెలంగాణ కోసమేనని, అందరికి అధికారం కోసం ఎన్నికలు అయితే కేసీఆర్‌కు మాత్రం తెలంగాణ కోసం ఎన్నికలని వ్యాఖ్యానించారు.