KTR On BC Congress Declaration Latest :బీసీల విషయంలో కాంగ్రెస్ మాటలకే పరిమితం కారాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఏ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళిక, రూ.20వేల కోట్లు పెట్టలేదని మండిపడ్డారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Jyothi Rao Phule Celebrations in Telangana Bhavan : అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. ఎస్టీ, ఎస్సీ స్థానాలు పోగా 12 లోక్సభ స్థానాల్లో ఆరు సీట్లను బీసీలకు కేటాయించామాని తెలిపారు. బీఆర్ఎస్ మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చిత్తశుద్ధి చాటుకుందని తెలిపారు. కులవృత్తుల్లో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది కేసీఆర్ ఆలోచన అని చెప్పారు.
పూలే 200 జయంతి వరకు రాష్ట్రంలో సమున్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దీక్ష కూడా చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1008 గురుకులాలు స్థాపించి ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వివక్షపై విద్యతోనే విజయం సాధించవచ్చని తన ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు.