KTR Fires on Governor Tamilisai : గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులు కానీ, రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వన్ని తిరస్కరించారని కేటీఆర్ ఆక్షేపించారు. కానీ ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం పేరు ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలని డిమాండ్ చేశారు.
KTR Reaction on Governor Quota MLCs : రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పని చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు, ఇవాళ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అన్న విషయాన్ని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలుపుతోందని అన్నారు. ఈ క్రమంలోనే సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఎన్నికైన సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగించాలి కానీ, పర్సన్ ఇన్ఛార్జ్లను పెట్టొద్దని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయాలి కానీ, ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్ఛార్జ్లు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
45 రోజుల పాలనలో దిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ సాధించింది ఏమీ లేదు : కేటీఆర్