KTR MLC Election Campaign in Narsampet : వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు.
KTR Fires on Congress : వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మద్దుతుగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అలవికాని హమీలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధీ చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తొలి సంతకమే రుణమాఫీపై పెడతామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామన్న సీఎం అన్నదాతలను మోసం చేశారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం నాటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి గురించి ఆలోచించాలని కేటీఆర్ అన్నారు.
ఆరు నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ గురించి యువత ఆలోచించాలని కేటీఆర్ కోరారు. రైతు భరోసా రూ.15,000లు ఇస్తామని, కౌలు రైతులు, కూలీలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని హస్తం పార్టీ చెప్పిందని, మరి చేశారా అని ప్రశ్నించారు. మొదటిసారి మోసపోతే వారి తప్పు, మరోసారి మోసపోతే మన తప్పని అన్నారు. తమ పాలనలో కరెంట్ పరిస్థితి ఏమిటి, ఇప్పటి పరిస్థితి ఏమిటో ఆలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు.