తెలంగాణ

telangana

ETV Bharat / politics

అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు : కేటీఆర్ - KTR COMMENTS ON CM REVANTH REDDY

అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారన్న కేటీఆర్‌ - అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని విమర్శలు

KTR Comments On ADANI  ISSUE
KTR Comments On Cm Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 1:08 PM IST

KTR Comments On Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారన్నారు. అవగాహనా రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. అదానీతో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా మాపై కోపం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అని అబద్దపు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. జాతీయ రహదారుల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని రేవంత్ అంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా జాతీయ రహదారుల పనులు ఇస్తుందా అని ప్రశ్నించారు. గతంలో డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ నుంచి రూ.31 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని అన్నారు.

అదానీ చెక్ ఇచ్చి 30 రోజులు గడచిపోయినా ఎందుకు క్యాష్ చేయలేదని అసలు చెక్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అదానీ తప్పిదాల గురించి రాహుల్ మొట్టికాయలు వేస్తే రేవంత్ రెడ్డి నాపైన మండిపడుతున్నారని అన్నారు. రాహుల్ అదానీ గురించి ఎప్పటి నుంచో చెబుతుంటే రూ.12 వేల కోట్లకు పైగా ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదని అన్నారు. అదానీ ఒప్పందాలు రద్దు చేసిన కేసీఆర్​ను రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఒకవేళ తాము అదానీతో ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది కోసం రేవంత్ రెడ్డి దిల్లీకి పోతే ఇబ్బంది లేదు కానీ, సీఎం 28 సార్లు దిల్లీ వెళ్లి ఒక్క రూపాయి కూడా తేలేదని పేర్కొన్నారు. సీఎం దిల్లీ పర్యటన కుర్చీ కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి మూటల ఇచ్చేందుకే కానీ, ప్రజల కోసం కాదని విమర్శించారు.

20 రోజులు పోరాటం చేసి మృత్యువుతో పోరాడి చనిపోయిన శైలజతో పాటు.. గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది విద్యార్ధుల తల్లిదండ్రులకు కేటీఆర్‌ బీఆర్ఎస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్లక్ష్యంతో ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

"సీఎం రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అదానీకి ఇచ్చిన పనులు అంటూ పిచ్చి నివేదిక విడుదల చేశారు. అవగాహనా రాహిత్యంతో సీఎం మాట్లాడితే ఎలా?. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారు.అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు."-కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు

స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళతాం : కేటీఆర్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details