Koneru Konappa To Join Congress :బీఆర్ఎస్ అసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. రేపు మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్(Congress) కండువా కప్పుకోనున్నారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే(MLA) కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు ప్రస్తుత జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కోనప్ప పార్టీని వీడనుండటంతో ఎంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఆయన వెంట నడుస్తారనేది ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనప్ప పార్టీ కోసం అన్నీ తానై ముందుండి నడిపించే వారు. పార్లమెంటు(Parliament) ఎన్నికల నేపథ్యంలో బలమైన నాయకులు, మండల, గ్రామస్థాయిలో పట్టున్న నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారనుందనే వాదన ఉంది.
'సిర్పూర్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా'
Koneru Konappa Resigns To BRS :ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి, తుమ్ములేటి ప్రాజెక్టు కోసం చాలా చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ అంశాలపై ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసి వివరించామని పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కోనేరు కోనప్ప స్పష్టం చేశారు.