Kk Son Viplav Comments on His Father Keshava Rao : రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారేమోనని బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరాలన్న తన తండ్రి కేశవరావు నిర్ణయం బాధ కలిగించిందని తెలిపారు. గతంలో పొన్నాల లక్ష్మయ్య గురించి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ 84 ఏళ్ల వయసున్న కేశవరావును కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలి :ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కుమార్తె ఒత్తిడితోనే కేశవరావు పార్టీ మారారని, ఇప్పుడైన ఆయన పునరాలోచన చేసుకోవాలని విప్లవ్ కుమార్ సూచించారు. గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్కు చేసింది ద్రోహమే అన్న విప్లవ్, ఆమె మేయర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని డిమాండ్ చేశారు.
'కేశవరావు మా ఫాదర్ ఈ ఏజ్‌లో ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ? బీఆర్ఎస్కు బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఆ టైంకి ఒక సీనియర్ లీడర్‌లాగా కేసీఆర్ పక్కన ఉండి, ఆయనకు సపోర్ట్ చేయాలి. పార్టీకి మీరు కావాలి, మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలి.'-విప్లవ్ కుమార్, బీఆర్ఎస్ నేత
Dasoju Sravan Comments on BRS : ఈగలు, కప్పల్లాగ కాంగ్రెస్‌లోకి వెళ్తున్న నేతలకు బీఆర్ఎస్కు అధికారంలో ఉన్నన్నాళ్లు ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ఆ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. కన్నతండ్రిలా చూసుకున్న కేసీఆర్‌ను వదిలిన దానం నాగేందర్‌కు ఇపుడు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. వంద కోట్లతో కట్టిన తన ఇంటిని కేసీఆర్‌కు ఇస్తానన్న నాగేందర్, ఇపుడు ఏం మారిందో సమాధానం చెప్పాలని శ్రవణ్ ప్రశ్నించారు.