Telangana Lok Sabha Election Results 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 సీట్లను కట్టబెట్టారు. డబుల్ డిజిట్ స్థానాల్లో పాగా వేయాలని భావించిన కమలం పార్టీ సింగిల్ డిజిట్ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఒక దఫా ఎంపీగా గెలిస్తే మరోసారి అవకాశం కల్పించడం సికింద్రాబాద్ ప్రత్యేకతని చెప్పవచ్చు. నాలుగున్నర దశాబ్దాల్లో ఒక్కసారి మినహాయిస్తే, అన్నిసార్లు ఇదే తంతు రిపీట్ అయింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సైతం రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించారు. దీంతో పాత ఒరవడి పునరావృతమైనట్లైంది.
Lok Sabha Election Results 2024 : ప్రస్తుత హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ మాత్రం 4 సార్లు సికింద్రాబాద్ స్థానం నుంచి విజయం సాధించడం విశేషం. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఇప్పటి వరకు రెండేసిసార్లు గెలిచిన వారే ఎక్కువ. 1979, 1980లలో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పి.శివశంకర్ గెలుపొంది, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం టి.అంజయ్య గెలిచారు. ఆయన హఠాన్మరణంతో 1987లో ఉప ఎన్నిక జరిగింది. దీంతో అంజయ్య సతీమణి మణెమ్మ విజయం సాధించగా, 1989లో జరిగిన ఎన్నికల్లోనూ ఆమె మళ్లీ గెలుపొందారు.
రెండుసార్లు ఎంపీగా గెలిచిన వారి సరసన కిషన్‌రెడ్డి : 1991లో బండారు దత్తాత్రేయ తొలిసారిగా గెలిచారు. 1996లో ఓటమి పాలైనప్పటికీ 1998, 1999, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో దేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ రాజేశ్వర్‌రావు విజయం సాధించినప్పటికీ, మళ్లీ గెలవలేదు. 2004లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన అంజన్‌కుమార్ యాదవ్‌ను 2009 ఎన్నికల్లోనూ విజయం వరించింది. 2019 ఎన్నికల్లో గెలుపొందిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం కూడా విజయదుందుభి మోగించి రెండుసార్లు ఎంపీగా గెలిచిన వారి సరసన చేరారు.