Telangana Govt On Agriculture : రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు రూ.17,870 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు తెలిపింది. పంటల బీమాకు రూ.1,300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు రైతుపండగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వం రైతు పండగ జరుపుతోంది. మహబూబ్ నగర్లో 25 విభాగాలకు చెందిన 150 స్టాళ్లను సిద్ధం చేసింది. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా సన్నాహాలు చేసింది. మూడు రోజుల రైతు పండగను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు రేపు ఇతర జిల్లాల రైతులు సదస్సుకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇవాళ, రేపు 5వేల చొప్పున ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతులను సమీకరించాలని భావిస్తున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులుసదస్సులో పాల్గొంటారు.
బీఆర్ఎస్ విమర్శలు : ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ జరుపుతున్నారా అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని తొమ్మిది హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేస్తున్నారా అని అడిగారు. 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నారా అని సీఎంను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని ఆక్షేపించారు. ఏడాది పాటు రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతుపండుగ నిర్వహించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన అధికార పార్టీ : ప్రజాపాలన విజయోత్సవాలు, రైతు పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు హామీలిచ్చి పదేళ్లలో అమలుచేయలేదని, కాంగ్రెస్ ఏడాది కాలంలోనే హామీలు అమలు చేస్తోందని తన నియోజకవర్గం కొల్లాపూర్‌లో అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ పథకాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిచి మాట నిలబెట్టుకుంటోందని చెప్పారు. మిగిలిపోయిన రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 30వ తేదిన ప్రకటన చేస్తారని అన్నారు.
రైతు పండుగకు వేలాదిగా రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పంటలు ప్రదర్శించేందుకు స్టాళ్లు, వచ్చే వాహనాల కోసం పార్కింగ్, మంచినీళ్లు. తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, భోజన వసతులు సిద్ధం చేశారు. పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా నడుమ మూడు రోజుల పాటు రైతు పండుగ కొనసాగనుంది.
గాంధీభవన్‌కు వినతుల వెల్లువ - రెండోరోజూ కొనసాగిన మంత్రుల ముఖాముఖి - Ministers Meet with People