Kishan Reddy On Telangana Budget 2024 :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినబడ్జెట్(Telangana Budget 2024) పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా, పనులు కనీసం పార్టీ కార్యాలయం దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఆ పార్టీ ప్రజలను విభజించి పాలిస్తోందని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మోండా మార్కెట్ రామ్ గోపాల్ పేట్‌లో ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్ వెల్‌ను ప్రారంభించారు.
Kishan Reddy On Congress Guarantees :అనంతరం మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగానికి అరకొర నిధులు కేటాయించారని మండిపడ్డారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించడం లేదని కిషన్ రెడ్డి (BJP Telangana Chief Kishan Reddy) ఆరోపించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని రంగాలకు అన్యాయం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, బడ్జెట్‌లో కేటాయింపులకు అసలు పొంతనే లేదు. చాలా హామీలకు సంబంధించి పద్దులో కేటాయింపులే లేవు. ముఖ్యంగా విద్యారంగానికి అరకొర నిధులను కేటాయించింది. నిరుద్యోగ భృతి, మౌలిక వసతుల పెంపు అంశంపై బడ్జెట్ కేటాయింపులో నిధులు సరిపోవు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల కోసం హాస్టల్ మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంలో సహకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నప్పటికీ పనులు పార్టీ కార్యాలయం దాటి రావట్లేదు.- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు