తెలంగాణ

telangana

ETV Bharat / politics

రోడ్డు విస్తరణ, పార్కింగ్ తదితర అంశాలపై రేవంత్ ​రెడ్డికి కిషన్ ​రెడ్డి లేఖ - Kishan Reddy about Railway Station

Kishan Reddy Letter to CM Revanth Reddy : రైల్వే స్టేషన్​ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ, పార్కింగ్​ స్థలాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్​ పరిధిలో రాకపోకలకు ఇబ్బందులు రాకుండా అప్రోచ్​ రోడ్డును విస్తరించాలని, అదనపు భూమిని పార్కింగ్​ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాలని లేఖలో కోరారు.

Kishan Reddy about Railway Station Development
Kishan Reddy Letter to CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 9:29 PM IST

Kishan Reddy Letter to CM Revanth Reddy : రైల్వేస్టేషన్​ అభివృద్ధి పనుల నేపథ్యంలో రోడ్డు విస్తరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో టెర్మినల్ నిర్మాణం, అదనపు ప్లాట్ ఫాంల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, రైల్వేస్టేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా, స్టేషన్‌కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాల రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

పార్కింగ్ తదితర అవసరాల కోసం రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన అదనపు భూమిని కేటాయించాల్సి ఉందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్త స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి ప్రధాన రహదారిగా మారనుందన్నారు. భరత్ నగర్ వైపు నుంచి చర్లపల్లి స్టేషన్​కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలన్నారు. ఇక్కడ ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉందని, దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలని కోరారు.

ఈసారైనా బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు దక్కేనా?

Kishan Reddy about Railway Station Development :ఈసీ నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్‌లోని యంయంటీఎస్‌(MMTS) ప్లాట్‌ఫాంను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉందని కిషన్​ రెడ్డి తెలిపారు. కాబట్టి ఈ రహదారి నుంచి స్టేషన్‌ను చేరుకునే రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వీటితో పాటుగా చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం వైపు 2.7 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్(Parking) తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉందని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం 4 కోట్లను రైల్వే శాఖ ఇప్పటికే జమ చేసిందని, ఈ నీటి కనెక్షన్‌ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వీటితో పాటుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుంచి రేతిఫైల్‌ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మౌలాలీ యార్డ్ స్టేషన్ పరిధిలో స్టేషన్‌కు ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాల నుంచి మురుగునీరు రైల్వేట్రాక్ మీదకు వస్తోందని, ఈ మురుగునీటి కారణంగా, ట్రాక్‌లు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

BJP Leader Kishan Reddy letter For Road :ఇక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జిల విస్తరణకు ఇదివరకే పనులు కూడా మంజూరయ్యాయని మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఏరియా పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడున్న 2 మీటర్ల నుంచి 4.8 మీటర్లకు విస్తరించాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ గతంలో ముఖ్యమంత్రికి 15 జూన్, 2022న, 07 మార్చి, 2023న లేఖలు రాసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ప్రత్యేక చొరవ తీసుకుని నగరానికి ఎంతో అవసరమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోగలరని కోరారు.

నేవీ రాడార్​కు అనుమతులిచ్చింది గత ప్రభుత్వమే - దీన్ని రాజకీయం చేయొద్దు : కొండా సురేఖ

ABOUT THE AUTHOR

...view details