Kishan Reddy Comments on Congress :సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి జీహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కిషన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. అంతకుముందు మెహబూబ్ కాలేజీ మైదానంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎన్నికల ముందు ప్రజలకు నివేదిస్తున్నట్లు వివరించారు.
6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి
Telangana Lok Sabha Elections 2024 : 2019లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించానని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. కేంద్రమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాంతరంగా పని చేశానని తెలిపారు. నాలుగున్నర ఏళ్లల్లో సికింద్రాబాద్‌కు చేసిన ప్రగతి నివేదికను ప్రజల ముందుపెట్టానని పేర్కొన్నారు. తాను ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పని చేశానని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"భవిష్యత్‌లో కూడా ప్రజల కోసం పని చేస్తా. సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వండి. చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని చేస్తా. ప్రచారం, అభ్యర్థుల ప్రకటనలో కమలం పార్టీ ముందుంది. తెలంగాణలో అన్ని పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీకి మధ్యే పోటీ. హస్తం పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు దక్కవు." -కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి