Kishan Reddy Fires On Congress :ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయవాతావరణం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టార్గెట్-400 దిశగా కొనసాగుతున్న ఈసారి తెలంగాణలో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ కొట్టి ఉత్సాహాం మీదున్న హస్తం పార్టీ మరోసారి తెలంగాణలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తమపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకు సానుకూలత లేదన్న కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టారు.
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు : ఏ రంగంలో కూడాబీజేపీని తప్పు పట్టే అవకాశం లేదన్నారు కిషన్ రెడ్డి. తమ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలకు దిగుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఒక్క సాక్ష్యం చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.