KCR Bus Yatra Start in Miryalaguda :ఆరు గ్యారంటీలకు పంగానామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్, లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు వస్తోందని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించారు. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం, తనని జైల్లో వేస్తామంటున్నారని దేనికి భయపడేది లేదన్నారు. గులాబీ ఎంపీల్ని గెలిపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో కేసీఆర్ బస్సుయాత్రనిర్వహించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ జల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని మండిపడ్డారు. సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని ఆక్షేపించారు. రైతుబంధులో దగా చేశారని, రైతుబీమా ఉంటుందో, ఊడుతుందో తెలియదన్నారు. మిషన్ భగీరథను కూడా నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని అమలు కావాలంటే, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
"ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే, బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలుచేపిస్తాం. గులాబీ పార్టీకి బలం ఇస్తే, అది తెలంగాణ ప్రజల బలమవుతుంది. ఇవాళ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలిస్తే భూమి, ఆకాశాన్ని ఏకం చేసే పోరాటం మేము చేస్తాం."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత