Junior NTR Reacts on AP Election Results: ఏపీలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు అనేకమంది మంగళవారం నుంచే అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయదుందుభి మోగించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ విషెస్ తెలుపుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నేడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబుకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేశ్, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణకు, ఎంపీలుగా గెలిచిన భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తారక్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కూటమి విజయం పట్ల ఎన్టీఆర్ స్పందించడంతో తెలుగుదేశం అభిమానులు, జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు.