Pawan Kalyan on CM YS Jagan Attack: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి అంశంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారన్న పవన్, గతంలో అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా అని అన్నారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడలో విద్యుత్ నిలిపి చీకట్లో యాత్ర చేయించారని నిలదీశారు.
పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదని అన్నారు. ఈ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భద్రతా చర్యల్లో లోపాలు ఉన్నాయని, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటో తేలాలని కోరారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలురైన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందని అన్నారు.
ఏపీలో ప్రధాని పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు. ఇలాంటి అధికారులు ఉంటే మళ్లీ ప్రధాని వచ్చినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని, వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలని కోరారు.
రాయి దాడి ఘటనపై ముఖేష్ కుమార్ మీనా సమీక్ష- దర్యాప్తును వేగం చేయాలని సూచన - AP CEO Mukesh Kumar Meena
CP Kanti Rana Tata: మరోవైపు సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో విచారణ వేగంగా కొనసాగుతుందని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. రూఫ్‌టాప్‌కు విద్యుత్ వైర్లు తగులుతాయని విద్యుత్ నిలిపివేసినట్లు తెలిపారు. సీఎం భద్రతకోసం అన్ని చర్యలు తీసుకున్నామని కాంతి రాణా పేర్కొన్నారు.
రాత్రి 8.04 గం.కు వివేకానంద స్కూల్ వద్ద ఒక వ్యక్తి రాయి విసిరాడని సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. ఆ ప్రాంతంలోని 24 సీసీ టీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌లు పరిశీలించామన్నారు. ఒక వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది సీఎం నుదుటికి తగిలింది, రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెలంపల్లిపై పడిందని సీపీ తెలిపారు. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. దర్యాప్తు వేగంగా సాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఐదారు వేల మంది ఉన్నారని, దాడి జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ కొన్ని రాళ్లు సేకరించారని వెల్లడించారు. రాయి దాడి చేతితోనే జరిగిందని భావిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అరచేతిలో పట్టేంత రాయి విసిరినట్టు వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తే అర్థమవుతోందన్నారు.
సీఎం భద్రత కోసం విద్యుత్ తొలగించాం- బలంగా రాయి విసిరినట్లు తెలుస్తోంది: సీపీ కాంతి రాణా - Stone Attack on CM Jagan