JanaSena Chief Pawan Kalyan Selecting MLA Candidates:తెలుగుదేశం, బీజేపీతో పొత్తులు, పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే ఆరుస్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి నియోజకవర్గాల అభ్యర్థులను పవన్ పిలిపించుకుని మాట్లాడారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని పవన్ కల్యాణ్ చెప్పారు. అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో ఎన్నికల్లో పోరాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నేతలకు సూచించారు. కచ్చితంగా గెలిచి తీరాలని ఉద్బోధించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ప్రతిదశలోనూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సిద్ధం, సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం: పవన్ కల్యాణ్
అభ్యర్థిత్వాలకు ఆమోదం: ఈ క్రమంలో కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి ఇటీవల పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. దాదాపుగా ఈ స్థానం కూడా ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే జనసేన తరఫున నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనసేన కార్యాలయానికి వీరు రాగా పవన్‌కల్యాణ్ విడివిడిగా సమావేశమై ఆయా నియోజకవర్గాల పరిస్థితులపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలపై సమాచారాన్ని వారికి అందించారు.