YSRCP Protests Across the State over Electricity Tariff Hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహించింది. సబ్‌స్టేషన్ల వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు నిరసన తెలిపారు. ప్రజలపై భారం మోపడం కూటమి ప్రభుత్వానికి తగదన్న నేతలు కరెంటు ఛార్జీల భారం తగ్గించే వరకు పోరు కొనసాగుతుందని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ నిరసన తెలిపారు. పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏఈకి వినతి పత్రం అందజేశారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులకి వినతిపత్రం ఇచ్చారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బాపట్ల జిల్లా చీరాలలో వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ విద్యుత్ ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రేపల్లెలో ఫ్లకార్డ్లతో నిరసన తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత - ఎంపీపీ గది తాళాలివ్వలేదని ఎంపీడీవోపై దాడి
కాలినడకన ప్రదర్శన: శ్రీకాకుళంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఎస్ఈకు వైఎస్సార్సీపీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చాయి. నరసన్నపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల భారాన్ని మోపిందని నేతలు ఆరోపించారు. టెక్కలిలో ఇందిరా కూడలి నుంచి విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. విజయనగరంలో కాళీమాత ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు కాలినడకన ప్రదర్శన చేశారు. ఉచితంగా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఉరి తాళ్లు వేసుకుని నిరసన: నెల్లూరులో విద్యుత్ బిల్లులతో ఉరి తాళ్లు వేసుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చర్చి సెంటర్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు పోరుబాట ర్యాలీ సాగింది. దర్శిలో ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొదిలి రోడ్డులోని డీఈ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పులివెందులలో పాత బస్టాండ్ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కర్నూలులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఫ్రీహోల్డ్ పేరుతో 1.26 లక్షల ఎకరాల్లో వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు