APAAR ID CARDS : ఒకటి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్స్‌కి కేంద్ర ప్రభుత్వం 12 అంకెల అపార్ ఐడీ (Automated Permanent Academic Account Registry) కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ ఆధార్ గుర్తింపు కార్డులో ఉన్నట్లే స్కూల్ రికార్డుల్లోని వివరాలను జనవరి 31వ తేదీ వరకు మార్చుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆధార్ కార్డు, పాఠశాల రికార్డుల్లో స్టూడెంట్ పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలు రెండు చోట్లా ఒకేవిధంగా ఉండాలన్నారు. తొలుత ఆధార్‌లో తప్పులుంటే సరిచేసుకోవాలని, ఆ తర్వాత పాఠశాలల రికార్డుల్లో మార్చుకోవాలని తెలిపారు. ఈ వివరాల ఆధారంగానే అపార్ ఐడీ సంఖ్యని కేటాయిస్తారు.
ఏపీలో 2.10 లక్షల మందికే: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7.75 కోట్ల మందికి అపార్ ఐడీ మంజూరుకాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18వ తేదీ వరకు 2.10 లక్షల మందికే (3%) ఈ ఐడీ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడటంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వివరాల మార్పులు చేసే అధికారాలను కిందిస్థాయి అధికారులకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈఓలకు, మోడల్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత వరకు ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ ఈఓ/డీఈఓలకు ఈ మార్పులు చేసే అధికారాన్ని కల్పించారు.
అపార్ ఐడీ ఏమిటంటే?: జాతీయ నూతన విద్యా విధానం-2020 (National New Education Policy) సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ అపార్ ఐడీ సంఖ్య ఇచ్చే ప్రక్రియను 2023వ సంవత్సరంలో ప్రారంభించింది. శిశు తరగతుల నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ఈ అపార్ ఐడీ నంబరు ఉంటుంది. తద్వారా స్టూడెంట్స్ డ్రాపౌట్లు, ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినా అతని అభ్యసన సామర్థ్యాలను పరిశీలించవచ్చు. స్టూడెంట్స్ సర్టిఫికెట్లు, క్రెడిట్లను నిక్షిప్తం చేసే అకడమిక్ బ్యాంకు క్రెడిట్ (ABC)తో అపార్ ఐడీ అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల సర్టిఫికెట్లకు భద్రత ఉండదు. అయితే ఆప్షనల్ చెబుతుండటం, ఆధార్ అవసరం ఉండటంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు.
ఆధార్ కార్డులో తప్పులుంటే?: స్టూడెంట్స్ ఆధార్ నమోదుకు, వివరాల మార్పుచేర్పులకు విద్యాశాఖ 1343 ఆధార్ నమోదు సెంటర్లను నడుపుతోంది. 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఆ సెంటర్ల ద్వారా 1.11 లక్షల మందికి కొత్తగా ఆధార్ నమోదుతోపాటు, 9.72 లక్షల మంది వివరాలను మార్పు చేశారు. ఆధార్ కార్డులో పేరును జీవితంలో రెండుసార్లు, పుట్టిన తేదీ, లింగం ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది. అడ్రస్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు.
విద్యార్థుల అకడమిక్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా 'అపార్'