ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగనన్న మద్యం దుకాణాలు - ఉమ్మడి అనంతలో 33వేల మంది ఆస్పత్రి పాలు - ap liquor brands - AP LIQUOR BRANDS

Government Liquor Stores : దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన జగన్‌మోహన్​రెడ్డి అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు బార్లు బార్లా తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేసి జేబులు నింపుకొంటున్నాడు.

jagan_brand_liquor_sales_in_andrapradesh
jagan_brand_liquor_sales_in_andrapradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 1:04 PM IST

Government Liquor Stores : దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌ కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి నాసిరకం మద్యం ప్రవేశపెట్టి ధరల్ని అమాంతం పెంచేశారు. నాసిరకం మద్యం కారణంగా నిత్యం వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నా ఆయా కుటుంబాలతో చెలగాటం ఆడారు. ఇవేమీ పట్టించుకోని జగన్‌.. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. మద్యపాన నిషేధంపై మాత్రం నోరెత్తకుండా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. ప్రభుత్వం విక్రయించే కల్తీ మద్యం కారణంగా వేలాది మంది ఆసుపత్రి పాలవుతున్నా పట్టింపులేదు. మరోవైపు జిల్లాలో నేరాల రేటు అమాంతం పెరిగిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు భరించలేని విధంగా ఎక్కువయ్యాయి. మందుబాబులను తాకట్టు పెట్టి వేలాది కోట్లు అప్పు చేసిన సీఎం ఈ భారమంతా జనంపై మోపారు.

ఏటా రూ.1,020 కోట్లు :ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 200 ప్రభుత్వ దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. 2019కు ముందు రూ.80కు వచ్చే 180 ఎంఎల్‌ బ్రాందీ ఇప్పుడు రూ.160 చేశారు. అప్పట్లో క్వార్టర్​ విస్కీ రూ.80కి దొరికేది కానీ ఇప్పుడు రూ.200కు పెంచి అమ్ముతున్నారు. గతంలో మ్యాన్సన్‌ హౌస్‌ క్వార్టర్‌ సీసా రూ.120 కాగా, రూ.240 చేశారు. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.110 ఉండగా ఇప్పుడు రూ.220కి కూడా దొరకడం లేదు. రోజుకో రేటు పెట్టి మందుబాబుల జేబు గుల్ల చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొత్తరకం అంటూ నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రతిదానిపై రెట్టింపు ధరలు వసూలు చేసుకుంటున్నారు. నెలకు సగటున రూ.135 కోట్ల ఆదాయం చొప్పున ఏటా రూ.1,620 కోట్లు ప్రభుత్వానికి చేరుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలపై ఆదాయం ఏడాదికి రూ.600 కోట్లకు మించి ఉండేది కాదు. అంటే ఉమ్మడి జిల్లాలోని మందుబాబులపై ఏటా రూ.1,020 కోట్లు అదనపు భారం పడుతుండగా ఐదేళ్లలో 5,600 కోట్లు అదనంగా వసూలు చేశారు. కరోనా కాలం మినహాయించినా నాలుగేళ్లల్లో జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.4,080 కోట్లు అదనంగా వసూలు చేసింది.

వైసీపీ సమర్పించు 'జగనన్న బెల్టు షాపులు' - అధికారం అండతో యధేచ్చగా అమ్మకాలు

ప్రాణాలు తీస్తున్న వైనం :గతంలో వైన్‌షాపుల్లో దొరికే బ్రాండ్లు ఇపుడు జగన్‌ ప్రభుత్వం హయాంలో లభించడం లేదు. అధికార వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన డిస్టిలరీ కంపెనీ నుంచే ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాసిరకం సరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు. 'జె' బ్రాండ్‌ తాగి ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నాసిరకం తాగితే ఆకలి చచ్చిపోతుందని, విపరీతంగా చెమటలు పట్టి నిమిషాల్లోనే డీహైడ్రేషన్‌కు గురవుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. నరాల బలహీనత, కాలేయం సంబంధిత వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారు పెరిగిపోతున్నారని వైద్యులు చెప్తున్నారు.

డిసెంబరు 31న ఏపీలో రూ. 156.60 కోట్ల మద్యం హాంఫట్! అబ్కారీ శాఖ ఖుషి ఖుషి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకు సగటున 550 మంది అల్కాహాల్‌ బాధితులు అనంతపురం, హిందూపురంలోని మత్తు విమోచన కేంద్రాల్లో (డి-అడిక్షన్‌) చేరుతుండడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. జగన్​ పరిపాలన కొనసాగిన ఐదేళ్లలో దాదాపు 33 వేల మంది ఆసుపత్రుల పాలయ్యారు.

మద్యపాన నిషేధాన్ని గాలికొదిలారు- అమ్మకాల్లో రికార్డులు బద్దలు కొడుతున్నారు

నాణ్యతలేని మద్యం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. హంపయ్య కాలనీలో ఉంటున్న హుసేన్​కు భార్య మౌలాబీ, కుమార్తె, కుమారులు ఉన్నారు. ఎవరైనా ఆర్డర్‌ ఇస్తే సమోసాలు తయారు చేసిస్తూ జీవిస్తున్న ఈ కుటుంబం ఖాళీ సమయాల్లో కూలి పనులే ఆధారంగా బతుకీడుస్తోంది. పిల్లలు ఇంటి పనులు చేస్తూ చదువుతున్నారు. అయితే, గతంలో తాను మద్యం తాగినా ఇబ్బందులు రాలేదని, కరోనా తరువాత తాగిన నాసిరకం మద్యం కారణంగా ఆరోగ్యం దెబ్బతిందని హుసేన్‌ కన్నీటి పర్యంతమ్యాడు. వైద్యుల సూచన మేరకు నెల రోజులుగా మద్యపానం అలవాటుకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో తమ పోషణ కష్టంగా మారిందని, చేసిన అప్పులు ఏవిధంగా తీర్చాలో అర్థం కావడం లేదని హుసేన్​ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

పూర్తిగా మద్యం నిషేధిస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పిన మాటలు నమ్మి మహిళలమంతా ఓట్లు వేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధం అమలు చేయకపోగా ప్రభుత్వమే దుకాణాలు పెట్టి విక్రయించడం దుర్మార్గమైన చర్య. వైఎస్సార్సీపీ నాయకులే వ్యాపారుల అవతారమెత్తారు. అధిక ధరకు నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కూలి ప్రజలు నాసిరకం మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. - వసుంధర, కెకె అగ్రహారం

Prathidhwani: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం స్కామ్.. ఎక్సైజ్ విధానం అసలు గుట్టేంటి?

ABOUT THE AUTHOR

...view details