High Court Judgment On Postal Ballot Counting in AP :ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటూ మే 30న స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
శుక్రవారం జరిగిన విచారణలో ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఈసీ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. చట్ట ప్రకారం నిషేధం ఉందని ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని వాదించారు. అధికరణ 329(బి) ప్రకారం ఎన్నికలను సవాలు చేయాలంటే కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సాధ్యమని ఎలాంటి సందర్భాల్లో ఎన్నిక చెల్లుబాటుకాదో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 స్పష్టం చేస్తోందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల విషయంలో మాత్రమే ఈసీ గత నెల 30న ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారని ఈ నేపథ్యంలో ఫారం13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆ అధికారి పేరు, హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్ బ్యాలట్ ప్రక్రియ అంతా వీడియో రికార్డు అయ్యిందని ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులూ ఉన్నారని వివరించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 2023 ఆగస్టులో నిబంధన 18(ఏ) తీసుకొచ్చారని ఇతర పోస్టల్ బ్యాలట్ల విషయంలో గ్రూప్-ఏ,బీ అధికారులు అటెస్టేషన్ చేస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన ఫారం 13ఏ పైమాత్రం ఆర్ఓ నియమించిన అధికారి అటెస్టేషన్ చేశారని ఈ నేపథ్యంలో ఆ అటెస్టేషన్పై సందేహం అవసరం లేదని వాదించారు.