CM Chandrababu Naidu Kuppam Tour Second Day: కుప్పం టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేశారు. అదే విధంగా 'జననాయకుడు' పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి యత్నించారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం: కుప్పం నియోజకవర్గం ఎప్పుడూ టీడీపీనే గెలిపించిందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు.'జననాయకుడు' పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తెచ్చిన సమస్యలన్నీ రికార్డవుతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
కుప్పంకి నేను చేయాల్సింది చాలా ఉంది: 8 సార్లు తనను గెలిపించిన నియోజకవర్గానికి తాను చేయాల్సింది చాలా ఉందని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తమదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఇక్కడ 'జననాయకుడు' పోర్టల్ పెట్టుకున్నామని, ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారమనేది పూర్తిగా తెలియాలని సూచించారు. నీతి, నిజాయితీగా రాజకీయాలు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రావాలనే భావన పోవాలని అభిప్రాయపడ్డారు.
సమాజానికి సేవ చేయాలనే యోచనతోనే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. బనకచర్ల వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరమని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, కృష్ణా నది నుంచి 800 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లు ఇస్తే కరవు జిల్లా అనే పేరు ఇక ఉండదని పేర్కొన్నారు.
అనంతరం కుప్పంలో పలు నిర్మాణ పనులకు, మదర్ డెయిరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఐఐటీ కాన్పూర్, అలెప్ మహిళాశక్తి భవన్ ఒప్పంద కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. భూమి పత్రాలు ఫోర్జరీ చేయకుండా చర్యలు చేపట్టామని, ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ప్రజలు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారాలన్నారు. అందరికీ పని కల్పించాలి, ఆదాయం పెంచాలి ఇదే తమ నినాదమని పేర్కొన్నారు.
కుప్పంలో సూర్యఘర్ పథకం - భవిష్యత్లో విద్యుత్ బిల్లు కట్టే భారం ఉండదు: సీఎం చంద్రబాబు
స్వర్ణ కుప్పం- విజన్ 2029! డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు