PM Surya Ghar Muft Bijli Yojana Apply Online : దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పొందవచ్చు. ఇంతకీ ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
సౌర విద్యుత్‌ను అందరికీ చేరువ చేసి, సుస్థిర ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో కేంద్రం 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా మూడు కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ ఇస్తోంది. ఒక్కో కిలోవాట్‌కు రూ.30వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. 2 కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు అయితే రూ.78 వేలు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. అంటే 3 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా రూ.78 వేలు భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేకుండా తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా లోన్లు పొందొచ్చు.
ఆదా ఎంతంటే?
సూర్యఘర్ వెబ్‌సైట్ ప్రకారం- 1 కిలోవాట్‌కు దాదాపు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రస్తుత వినియోగం ప్రకారం నెలకు రూ.1000 కరెంట్ బిల్లు వస్తుంది. అదే సోలార్ వ్యవస్థ ఏర్పాటు వల్ల అయ్యే ఖర్చు రూ.338 మాత్రమే అవుతుంది. దీంతో సంవత్సరానికి రూ.8వేలు ఆదా అవుతుంది. అదే నెలకు 240 యూనిట్లు వినియోగించే వారికైతే నెలకు రూ.2 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తుందనుకుంటే, సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు వల్ల రూ.333 మాత్రమే ఖర్చవుతుంది.
ఎవరికి ఎంత కెపాసిటీ?
నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి 1 నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యఘర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 150 నుంచి 300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైబడి కరెంట్‌ను వినియోగించే వారు మూడు కిలోవాట్, ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కిలోవాట్లకు మించి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా రూ.78 వేలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు. మిగులు కరెంట్ కావాలంటే నెట్‌మీటరింగ్ ద్వారా విక్రయించుకోవచ్చు.
కరెంట్ వాడకుంటే డబ్బులు వాపస్!
ఒక్కసారి మీరు సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఇంటి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే, ఈ పథకం ద్వారా మరో ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, మీరు కేంద్రం కేటాయించిన 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటే మిగిలిన కరెంట్‌కు డబ్బులు కూడా చెల్లిస్తారు.
ఈ డాక్యుమెంట్స్ ఉండాలి!
- ఆధార్ కార్డు
- విద్యుత్ బిల్లు
- రేషన్ కార్డు
- మొబైల్ నెంబర్
- బ్యాంకు ఖాతా పాస్ బుక్,
- ఈమెయిల్
- ఈ సోలార్ ప్యానెల్ అమర్చుకోవడానికి 35 గజాల స్థలం అవసరం.
ఇలా అప్లై చేయండి!
- ముందుగా పీఎం సూర్యఘర్ (pmsuryaghar.gov.in) పోర్టల్‌లో పేరును రిజిస్టర్ చేసుకోండి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆపై మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి.
- ఇప్పుడు కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నంబర్‌తో సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ 'రూఫ్‌టాప్ సోలార్' కోసం అప్లై చేసుకోవాలి.
- అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వెయిట్ చేయాలి.
- అనుమతి వచ్చిన అనంతరం మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్‌స్టలేషన్ పూర్తయిన అనంతరం, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి.
- నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు చెక్ చేస్తారు. అలాగే పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
- ఈ రిపోర్ట్ పొందిన అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఇలా చేస్తే 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
వామ్మో! కిలోమీటరు పొడవైన భారీ వల - ఒక్కసారి వేస్తే 50 టన్నుల చేపలు
వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల - టోకెన్లు ఉన్న భక్తులకే స్వామి దర్శనం