Cabbage Pakoda Recipe in Telugu: ఫంక్షన్లకు వెళ్లినప్పుడు, హోటళ్లు, కర్రీ పాయింట్లలోనో చేసే క్యాబేజీ పకోడి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కరకరలాడుతూ తిన్నాకొద్దీ ఇంకా తినాలని అనిపిస్తుంటుంది. దీంతో అన్నీ పకోడీలు చేసినట్లే శనగపిండి, బియ్యం పిండి కలిపి చేయడమే కదా!.. ఇంట్లో చేసుకుందాంలే అని అనుకుంటారు చాలా మంది. కానీ మామూలు పకోడిల్లాగా చేస్తే అంత రుచి రాకుండా మెత్తగా వస్తాయని అంటున్నారు. ఇలా చేస్తే మాత్రం క్యాబేజీ పకోడి క్రిస్పిగా వస్తుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- 350 గ్రాముల క్యాబేజీ
- 2 పచ్చిమిరపకాయలు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీ స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- ఒక టీ స్పూన్ కారం
- ఒక టీ స్పూన్ ధనియాల పొడి
- ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి
- ఒక కప్పు శనగపిండి
- రెండు టీ స్పూన్ల బియ్యం పిండి
- 2 రెమ్మల కరివేపాకు
- నూనె
తయారీ విధానం
- ముందుగా క్యాబేజీ తీసుకుని అందులో మధ్యన ఉన్న దుంపని తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు తరుక్కున్న క్యాబేజీలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 30 నిమిషాలు వదిలేస్తే క్యాబేజీలో నుంచి నీరు దిగుతుంది.
- ఆ తర్వాత నీరు వదిలిన క్యాబేజీని గట్టిగా పిండి నీరంతా తీసేయాలి. (నీరు ఉంటే పకోడిలు క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తాయి)
- అనంతరం నీరు పిండిన క్యాబేజీలో ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లులి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి గట్టిగా కలపాలి.
- ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు, బియ్యం పిండి, శననగపిండి వేసి గట్టిగా పిండుతూ కలపాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి మరిగించుకోవాలి.
- ఇప్పుడు తడిపొడిగా కలిపిన పిండిని చిన్న గోలీ సైజు ఉండలుగా చేసి నూనెలో వేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక నిమిషం వదిలేస్తే పకోడీ గట్టిపడుతుంది. అనంతరం నెమ్మదిగా తిప్పుకుంటూ ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే కరకరలాడే క్యాబేజీ పకోడీ రెడీ.
బిర్యానీ రుచికి అదొక్కటే కారణం - తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చిరుధాన్యాల పులావ్ ఇలా సింపుల్గా చేసేయండి - ఎంతో అద్భుతంగా ఉంటుంది