Peddireddy again occupied road: రాష్ట్రంలో జగన్ పాలన పోయి చంద్రబాబు పరిపాలన ప్రారంభమై రెండునెలలైంది. అయినా ఆ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు, వక్రబుద్ధిమాత్రం మారలేదు. తిరుపతిలోని ఇంటిముందు ప్రజా రహదారికి రెండువైపులా గేట్లు పెట్టి ఐదేళ్ల అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్న పెద్దిరెడ్డికి ఆ గేట్లు తొలగించి రాకపోకలకుఅవకాశం కల్పించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కానీ న్యాయస్థానం ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ సదరు సామంత రాజు పెద్దిరెడ్డి తాజాగా కొత్త కుట్రకు తెరలేపారు.
పెద్దిరెడ్డి ఇంటి వద్ద గేట్లు తెరిచే ఉంచాలి - హైకోర్టు ఆదేశం
కోర్టు తీర్పు మేరకు అధికారులు రెండు గేట్లు తెరిచారు. కానీ అధికారులు గేట్లు తెరిచిన కొద్ది సేపటికే ఆ రెండు గేట్ల మధ్యలో కార్యాలయం ముందు మరో కొత్త గేటు ఏర్పాటు చేసి తాళం వేశారు. ఇలా కొత్త గేటు ఏర్పాటు చేసి మళ్లీ రోడ్డుమీద రాకపోకలు సాగించే వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు గేట్లు తెరిచారని రోడ్డులో కొంత దూరం వెళ్లాక తాళాలేసిన మరో గేటు ఉండటంతో ముందకు వెళ్లే అవకాశం లేక అటుగా వెళ్ళిన ప్రజలు వెనక్కి వచ్చేస్తున్నారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని నగరపాలక సంస్థ రహదారిపై రాకపోకలకు అవకాశం కల్పించినా ఆయన దుర్మార్గం మాత్రం ఆగలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ విషయంలో నిద్ర నటిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఫోన్ చేసినా వారిలో స్పందన లేదని వారు వాపోతున్నారు.
సిమెంట్ రోడ్డుకు పెద్దిరెడ్డి "గేట్ "