KTR Press Meet : అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని, కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు హాజరయ్యానని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుందని ఎద్దేవా చేశారు. తనకు ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వినియోగించుకుంటానని, సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారని మండిపడ్డారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిలా విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్, విచారణకు లాయర్లతో రావద్దని చెబుతున్నారని అన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు బుకాయించారని, మిమ్మల్ని నమ్మేది లేదని, మా లాయర్ ఉండాలని చెప్పినట్లు తెలిపారు. లాయర్ల సమక్షంలో విచారణ చేపట్టాలని హైకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టును కోరుతానన్న కేటీఆర్, ఏం జరగబోతుందో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ సచివాలయంలోనూ, మంత్రుల పేషీలోనూ జరగదని, విచారణ ఎప్పుడైనా న్యాయస్థానాల్లోనే జరుగుతుందని ఎద్దేవా చేశారు. గతంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేసులో అణాపైసా అవినీతి జరగలేదని మరోసారి చెబుతున్నానన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమని, ఏదో ఆశించి గూడుపుఠాణితో చేసిన పనికాదని స్పష్టం చేశారు.
మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ సోదాలు
ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధం: ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. మీ మాదిరిగా దివాలాకోరు పనులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలాంటి విచారణకు రావాలని పిలిచినా తాను వస్తానని వెల్లడించారు. గురువారం కూడా లాయర్లతో అనుమతిస్తే విచారణకు వెళ్తానని, ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని చెప్పారు. ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమన్నారు. ఏదో జరిగిందని కొందరు శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. విచారణను కొనసాగించాలని చెప్పిందే తప్ప కోర్టు తనకు శిక్ష వేయలేదని అన్నారు. తాను నేరం చేసినట్లు గానీ తప్పు చేసినట్లు గానీ కోర్టు చెప్పలేదన్నారు.
చర్చ పెట్టాలని అడిగితే పారిపోయారు: రేవంత్ కార్యాలయం నుంచి వచ్చేవన్నీ భగవద్గీత సూక్తులు కాదని, అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే పారిపోయారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు తనను ఎదుర్కొనే ధైర్యం లేదని, కేసు విషయమై 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదామంటే రాలేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెడితే రావడానికి తాను సిద్ధమన్న కేటీఆర్, చర్చ తర్వాత ఏసీబీ, ఈడీని పంపితే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానన్నారు. ఎలాంటి తప్పు చేయనందున కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తానని కేటీఆర్ తెలిపారు. రైతు భరోసా గురించి మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసం, తప్పుదోవ, మోసం చేయడం కాంగ్రెస్ నైజమని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - సుప్రీంకోర్టులో సవాల్