Harish Rao Tweet on LRS :కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా లే అవుట్ రెగ్యులేషన్స్ స్కీంను(LRS) ఉచితంగా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
హామీల అమలుపై మాట మార్చడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందన్న ఆయన, అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందని ఆక్షేపించారు. నో ఎల్ఆర్ఎస్ - నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్‌కు ఫీజులు వసూలు చేస్తామనడం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిదర్శనమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
Harish Rao Fires on Congress Party :కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన ఆదాయ సమీకరణ సమీక్షాసమావేశంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై కీలక నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులపై చేసిన ప్రకటనతో, ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించినట్లైంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇప్పుడు కల్పించారు.