Harish Rao Comments on Seetharama Project : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం కాంగ్రెస్ మంత్రులు సన్నాహక సమావేశాల పేరిట నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోటీలు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇష్టమైన ప్రాజెక్టుగా కేసీఆర్ నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం క్రెడిట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు సర్కార్ ఫీట్లు చేస్తోందన్న ఆయన, రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని, ప్రాజెక్టు తామే కట్టినట్లు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ కాల్ సెంటర్‌ను పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన ఆయన, ఇప్పటి వరకు 72 వేల ఫిర్యాదులు వచ్చాయని, అందరికీ న్యాయం జరిగేలా గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా కరవుని పారదోలాలన్న మహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామ చంద్రుల పేరిట ప్రాజెక్టు చేపట్టారని హరీశ్‌రావు తెలిపారు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు పరాన్నజీవులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడు, ఎనిమిది నెలల్లోనే అన్నీ చేసి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేశారా? అని ప్రశ్నించిన ఆయన, 30 వేల ఉద్యోగాల తరహాలోనే సీతారామ గురించి చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. సీతారామ విషయంలో నిజాలు చెప్తారన్న నమ్మకం తమకు లేదన్న ఆయన, బీఆర్ఎస్ విజయాలను కాంగ్రెస్ నేతలు తమవిగా చెప్పుకునే ప్రయత్నం చేయడమే తమ నైతిక విజయమన్నారు.
'జలాశయాలు పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి'- మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ - Harish Rao Letter to Minister Uttam
అసత్యాలు ప్రచారం చేస్తే దేవుడు కూడా క్షమించడు : సీతారామ ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ఘనత కాదని మంత్రి తుమ్మల గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచన చేయకపోయి ఉంటే, ఈ ప్రాజెక్టు అయ్యేదా అని నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఖమ్మం జిల్లాకు ఒక్క చుక్క గోదావరి నీరు కూడా ఇవ్వలేదన్న ఆయన, ఎనిమిది ప్యాకేజీల్లో ఐదు పూర్తిగా, మిగిలిన మూడులో 80 శాతం బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తే భగవంతుడు కూడా క్షమించరని, ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావదారిద్య్రం కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం బీఆర్ఎస్, కేసీఆర్‌కు చాలా సంతోషమన్న హరీశ్‌రావు, భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా యావత్తూ పండుగ నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు
సీతారామ ఎత్తిపోతల పథకం, కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు. ఈ ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ తమ విజయంగా సృష్టించుకుంటుంది. ఖమ్మం జిల్లాకు కరవు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు సంకల్పం చేసింది కేసీఆర్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సీతారామ ప్రాజెక్టు కట్టాలని సంకల్పించారు. 8 నెలల్లోనే సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా? కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మేము చేసిన ప్రతి మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నారు. - హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఇకనైనా పబ్లిసిటీ స్టంస్ట్స్ మానండి : మరోవైపు రాష్ట్రంలో పరిపాలన ఆగమైపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, చిన్నారులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 3 వేల డెంగీ కేసులు నమోదయ్యాయని, విష జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇకనైనా పబ్లిసిటీ స్టంస్ట్స్ మాని గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు గాడితప్పాయి : హరీశ్‌రావు - Harish Rao Fires On CM Revanth