Harish Rao Fires on BJP : పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఏం చేసిందో ప్రశ్నించాలన్నారు. మోదీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ఆయన, జీఎస్టీ వేసి నిత్యావసరాల రేట్లు పెంచారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది : ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుతో ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరిగాయని హరీశ్‌రావు ఆరోపించారు. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలిస్తామని భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆక్షేపించారు. బీజేపీకి చెప్పుకోవడానికి పథకాలే లేవన్న ఆయన, మోదీ సర్కార్ తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో 157 మెడికల్ కళాశాలలిస్తే, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఆ పార్టీ నేతలను అడగాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలకు సూచించారు.
కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 13 హామీలిచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని, చెప్పిన గడువు దాటినా హామీల అమలుపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెడతానన్న రేవంత్ రెడ్డి, అమలులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నిలదీశారు. ఏమీ చేయని కాంగ్రెస్, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు.