తెలంగాణ

telangana

ETV Bharat / politics

రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్‌ కార్డు, పీఎం కిసాన్‌ నిబంధనలు : హరీశ్‌రావు - BRS Leader Harish Rao Chit Chat - BRS LEADER HARISH RAO CHIT CHAT

Harish Rao Chit Chat : రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో అర్హులు అందరికీ రుణమాఫీ కావడం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉత్తర్వులు సవరించి అందరి రుణాలను మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా విడుదల చేయడం లేదని ఆక్షేపించారు. వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు వేతనాలు నెలల తరబడి బకాయి ఉన్నాయని, ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యుత్ శాఖ సంక్షోభంలోకి వెళ్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమను విమర్శించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ అధికారులకు డీజీపీగా ఎందుకు అవకాశం ఇవ్వలేదని మీడియా ఇష్టాగోష్టిలో ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 5:37 PM IST

Harish Rao Comments on Runamafi : బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించిన ఆయన, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నాలుగైదు ప్రజా సమస్యల విషయంలో తాను తట్టి లేపినట్లు వివరించారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు సహా కొన్ని సమస్యలు కొంత మేర పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు తమ హయాంలో ప్రతి నెలా రూ.275 కోట్లు ఇచ్చేవారమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా విడుదల చేయడం లేదని ఆక్షేపించారు.

పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చారు కానీ, పంచాయతీలకు నిర్వహణ కోసం నిధులు ఇవ్వలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు పెట్టారని, ఇప్పుడు ఆ అధికారులు బదిలీ అయ్యారని చెప్పారు. పదవీ కాలం ముగిసిన సర్పంచులు, బదిలీ అయిన కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధులు కేంద్రం 3 నెలల కింద రూ.800 కోట్లు విడుదల చేసిందని, వాటికి మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్రప్రభుత్వం రూ.350 కోట్లు ఇవ్వాలని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.2500 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని అన్నారు.

పంచాయతీలు అస్తవ్యస్తం : మన ఊరు - మన బడి పనులు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆయన, బిల్లులు రాక సర్పంచులు, చిన్న గుత్తేదార్లు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. నిధులు లేక పంచాయతీలు అస్తవ్యస్తం అయ్యాయని, సగం గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఆగిపోయిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. 8000 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదని, వసతి గృహాల్లో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందుల్లో కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు.

రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే : హరీశ్‌రావు - BRS Party ON LOAN WAIVER

రుణమాఫీలో కోతలు పెట్టేందుకే : రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన గురించి తాను ప్రశ్నిస్తే సీఎం స్పందించారు కానీ, ఉత్తర్వులు మారలేదన్న హరీశ్‌రావు, ఫలితంగా క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలై చాలా మందికి రుణమాఫీ కావడం లేదని వివరించారు. రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో 30 నుంచి 40 మందికి రుణమాఫీ కాలేదని ప్రాథమిక అంచనా అని పేర్కొన్నారు. 18 ఏళ్లు దాటితే ప్రత్యేక కుటుంబంగా పీఎం కిసాన్​లో పరిగణిస్తున్నారని, కానీ ఇక్కడ మాత్రం అమలు చేయకుండా ఆపుతున్నారని ఎద్దేవా చేశారు. కోతలు పెట్టేందుకు మాత్రమే ప్రభుత్వం రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు వాడుతున్నారన్న ఆయన, కొన్నిచోట్ల మొత్తం రుణం మాఫీ కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు తొలగిస్తూ ఉత్తర్వులను సవరించి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

తీవ్ర సంక్షోభంలోకి విద్యుత్ శాఖ : పాలనా వైఫల్యంతో విద్యుత్ శాఖను ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. కరెంట్ కోతలు ఉన్నాయంటే హరీశ్‌రావు తీసేయిస్తున్నారని అంటున్నారు కానీ, సమస్యను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. నిర్వహణకు ఒక్క రూపాయి, పరికరాలు లేకపోగా, రైతులు డీడీలు కడితే కూడా అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వడం లేదని ఆక్షేపించారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వడం లేదని, గృహజ్యోతి అమలు కూడా గందరగోళంగా ఉందని, కొంతమందికి మాత్రమే వస్తోందని తెలిపారు. మే, జూన్ నెలల పింఛన్లు ఇంకా ఇవ్వలేదని రూ.4000 ఇస్తామని రూ.2000 కూడా సరిగా ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

అప్పుడు చిటికేస్తే ఉద్యోగాలన్నారు - ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : హరీశ్‌ రావు - HARISH RAO ON JOB CALENDER

పోలీసులు కూడా కమీషన్ ఇవ్వాల్సిన దుస్థితి : 8 నెలల నుంచి కొత్తగా వితంతు పింఛన్లు కూడా ఇవ్వడం లేదన్న హరీశ్‌రావు, పోలీస్ శాఖకు డీజిల్ డబ్బులు కూడా విడుదల కావడం లేదని చెప్పారు. పోలీసులు కూడా కమీషన్ ఇచ్చి బిల్లులు విడుదల చేయించుకుంటున్నారట అని పేర్కొన్నారు. హోంగార్డులు, సాంస్కృతిక సారథి కళాకారులకు కూడా జీతాలు ఇవ్వడం లేదన్న హరీశ్‌రావు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు కొత్త చెక్కులు 8 నెలలుగా ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. తులం బంగారం అన్నారు, రూ.లక్ష కూడా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతు బీమా చెక్కులు కూడా ఆలస్యం అవుతున్నాయని, ఎందుకు ఆలస్యం అవుతున్నాయని మంత్రి తుమ్మల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని మాజీ మంత్రి గుర్తు చేశారు.

జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లకు నెలకు రూ.40 లక్షల నిధులు గతంలో ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను ఆపిందని తెలిపారు. గ్రేటర్​లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక విభాగాలు హైదారాబాద్ ఆసుపత్రుల్లోనే ఉంటే, ఆ విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారని హరీశ్‌రావు ఆక్షేపించారు. అత్యంత అనుభవం ఉన్న వారిని కూడా చిన్న ఆసుపత్రులకు బదిలీ చేశారని, సూపర్ స్పెషాలిటీ నిపుణులను ఆ విభాగాలు ఉన్న ఆసుపతుల్లోనే కొనసాగించాలని కోరారు. లోక్​సభ ఎన్నికల ముందు ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం పెట్టి డీఏలు, ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను రేపే ఇస్తామని చెప్పి ఐదు నెలలు అయినా ఆచరణకు నోచుకోలేదని గుర్తు చేశారు. 4 డీఏలు పెండింగ్​లో ఉండగా, ఐదో డీఏ కూడా వచ్చిందని అన్నారు.

'బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం - ప్రొటోకాల్‌ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాలి' - BRS Leaders Letter to Speaker

స్మితా సభర్వాల్ వ్యాఖ్యలతో ఏకీభవించను : అసెంబ్లీ చుట్టూ కంచెలు పెరిగాయని, విద్యార్థులపై లాఠీలు విరుగుతున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షంగా తాము లేవనెత్తుతున్న అంశాలను సూచనలుగా తీసుకొని ప్రభుత్వం పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు. గతంలో బిహారీ, పంజాబీలు అని తిట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు డీజీపీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అర్హత ఉన్న శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి, సీవీ ఆనంద్, నాగిరెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని అడిగారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ బిడ్డ మహేందర్ రెడ్డిని సుధీర్ఘ కాలం డీజీపీగా కొనసాగించినట్లు గుర్తు చేశారు. నాడు విమర్శించిన మహేందర్ రెడ్డి, సందీప్ కుమార్ సుల్తానియా లాంటి వారు ఇవాళ ముద్దయ్యారా అని అడిగారు. అధికారులపై రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నామన్న ఆయన, అధికారులపై మతం, కులం, ప్రాంతంతో ముడిపెట్టలేమని వ్యాఖ్యానించారు. దివ్యాంగులకు సంబంధించి ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.

స్మితా సభర్వాల్ ట్వీట్​పై దుమారం - క్షమాపణకు దివ్యాంగుల డిమాండ్ - Bala Latha Fires on Smita Sabharwal

ABOUT THE AUTHOR

...view details