Harish Rao Campaign in Nalgonda By Election : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నాలుగో డీఏ కూడా పెండింగులో ఉందని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఉపఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Harish Rao MLC By Election : కాంగ్రెస్ ప్రభుత్వంలో బడి పంతుళ్లపై లాఠీఛార్జ్‌లు చేయడం బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని హరీశ్ రావు అన్నారు. గతంలో ఉపాధ్యాయులపై ఇలాంటి జరిగిన ఘటనలు లేవని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ నిరుద్యోగులు, ఉద్యోగుల అందరిని మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు వంద రోజుల లోపల రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పిందని, ఇప్పటివరకు ఏ ఒక్క ఇవ్వలేదని మండిపడ్డారు. అమ్మాయిలకు ఉచిత స్కూటీ ఇస్తామన్నారని ఇవ్వలేదని పేర్కొన్నారు.
Harish Rao Comments on Congress : నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇవ్వలేదని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ విషయంలో అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని గుర్తు చేశారు. రిటైరైన ఉద్యోగులకు పింఛన్ బెనిఫిట్లను మూడు నెలలుగా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రశ్నించే గొంతు అయిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మోసం చేసిన కాంగ్రెస్‌కి గుణపాఠం చెప్పాలని అన్నారు.