BRS Leaders Inspect Areas Around Musi River :మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటన చేపట్టింది. హైదర్‌షా కోటలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల, మల్లారెడ్డి ఈ పర్యటనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల బృందానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. స్థానికులకు హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం భరోసా కల్పించింది. అంతకుముందు తెలంగాణ భవన్ నుంచి హైదర్‌షాకోటకు బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నేతలు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ధ్వజం :రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి, రూ.లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని హరీశ్‌రావు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, పథకాలకు డబ్బులు లేవంటూనే మూసీ డీపీఆర్కే రూ.1500 కోట్లు ఖర్చు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. హైదర్‌షాకోటలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మూసీకి అంత ఖర్చు చేసేవారు రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా? అని మండిపడ్డారు. 7 నెలల నుంచి మధ్యాహ్నా భోజన బిల్లు రావట్లేదని ఆక్షేపించారు.
గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారు :కాళేశ్వరం కూలిపోయింది అంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని, మూసీ పరీవాహక ప్రజలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.