Gutha Amit Reddy To Joins Congress :సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. గులాబీ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడగా, తాజాగా ఎంపీ ఆశావహులు కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి(Gutta Amith Reddy)కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు సమాచారం.
గుత్తా అమిత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన ఇవాళ సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగరి ఎంపీ టికెట్ ఆశించిన అమిత్ రెడ్డి భంగపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరితే భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన విషయం విదితమే. ఎన్నికల వేళ గులాబీ నేతలు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కమలం పార్టీలో చేరారు. వీరంతా దిల్లీలో తరుణ్‌చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.