GHMC Deputy Mayor Joined Congress : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీలత, శోభన్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ (Telangana Congress Deepa Dasmunsi) పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. హస్తం పార్టీలో చేరిన దంపతులకు సాదర స్వాగతం పలికారు.
Minister Ponnam On BRS Party :అనంతరం మంత్రి పొన్నంమాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులను విస్మరించిందని అన్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీ కోసం 24 సంవత్సరాలు కష్టపడ్డ వారిని కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పదవులు కట్టబెట్టడం సరికాదని వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వరాష్ట్ర సాధనకై పాటుపడిన ఉద్యమకారులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడింది." -పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీల నేతల చొరవ - పీసీసీ ఆమోదంతోనే చేరికలు కొనసాగించాలని నిర్ణయం