KTR Comments on Lok Sabha Polls : రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్‌పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన, రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, నెలకు రూ.2500 ఇవ్వలేదని రాష్ట్రంలోని మహిళలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు.
భారతీయ జనతా పార్టీపైనా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోదీపై కోపంతో ఉన్నారని తెలిపారు. దిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ-కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందని దుయ్యబట్టిన మాజీ మంత్రి, ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి కమలనాథులకు సహకరించారని ఆరోపించారు. ఆ పార్టీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే, రేవంత్ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే దిల్లీలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
చెన్నూరులో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ - KTR Election Campaign