KTR On Congress about Hydra :నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్న ఆలోచనతో హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పేదలు, మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని విమర్శించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హయాంలో కాదా? అని ప్రశ్నించారు. అక్రమాలన్నీ తవ్వితే బయటకు వచ్చేది కాంగ్రెస్ నేతల కుంభకోణాలే అని ఎద్దేవా చేశారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు.
కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ వాళ్లే అని, ఆ పార్టీ ఎమ్మెల్యేలవి కూలగొట్టి పేదోళ్ల వద్దకు రా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తప్పుంటే గవర్నమెంట్ నుంచి నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల కూలిన పేదల 40 వేల ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ లక్ష ఇల్లు కట్టించిందని గుర్తు చేశారు. రైతు భరోసా కాదని, ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదన్నారు. తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు అతి తెలివితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
'ఎక్కువకాలం డ్రామాలతో రాజకీయాలు సాగవు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి టాక్స్ నడుస్తోంది. హైడ్రాకు చట్టం లేదు, చుట్టరికం మాత్రమే ఉంది. పార్టీ మారిన వాళ్లు మా వాళ్లేనని సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు'- కేటీఆర్, మాజీమంత్రి