KTR and Harish Rao about Congress Attack in Musheerabad :''మీ తాటాకు చప్పుళ్లకు, పిల్లి కూతలకు భయపడే వాడెవ్వడూ లేడిక్కడ, ఇది ఉద్యమాల పిడికిలి, బలహీనుల గొంతుక గుర్తుపెట్టుకో'' అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉదేశిస్తూ హెచ్చరించారు. ఇవాళ అంబర్‌పేట నియోజకవర్గంలోని తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై కేటీఆర్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దాంతో పాటు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ''బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవు. నీ గూండా రాజ్యాన్ని ఎదిరించే నా స్ఫూర్తిని, నీ గుండాలు ఆపలేరు'' అని కేటీఆర్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ దాడి తనకు మరింత శక్తినిస్తుందని, తనను ఈ దాడులు ఆపలేవని స్పష్టం చేశారు.
దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్‌పై కాంగ్రెస్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ చెప్పే నఫ్రత్‌కా బజార్ మే మొహబత్ కా దుకాణ్ ఇదేనా అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు, నాయకుల అక్రమ అరెస్టులు, కేసులు ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రశ్నించారు. కేటీఆర్‌పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే : ఇవాళ హైదరాబాద్‌లో మూసీ బాధితులను కలవడానికి వచ్చి తిరిగి వెళుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ముషీరాబాద్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్ పర్యటించారు. కూల్చివేతల గురించి స్థానికులను అడిగి తెలుకున్నారు. అక్కడ బాధితులను కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఇంట్లో భోజనానికిగాను విద్యానగర్ మీదుగా వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.