Telangana EX Governor Tamilisai on Congress : ఎన్నికల ప్రచారంతో తెలంగాణ ప్రజలను మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర మాజీ గవర్నర్, దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను మరోసారి కలిసే అవకాశం కల్పించిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మెజార్టీ స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసిన తమిళిసై, ఫలితాల తరవాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా ఉంటారన్నారు. సౌత్ చెన్నైలో హోరా హోరీ పోటీ నెలకొన్నప్పటికీ తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను తీసివేసే ప్రసక్తే లేదని, దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తొలగిస్తారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరని ప్రశ్నించారు.
పది రోజులపాటు ప్రచారం :ఎమర్జెన్సీ సమయంలో బాధితురాలిగా తాను ఉన్నారని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆ సమయంలో తన తండ్రిని అరెస్ట్ చేశారని, అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డామని అవేదన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులో చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో తెలంగాణలో పది రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు.