Malla Reddy on BRS Leaders joining in Congress :మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్, బోడుప్పల్‌కు చెందిన కార్పొరేటర్లను తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమని చెప్పినట్లు ఆయన మీడియా ఎదుట వెల్లడించడంతో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో ఉంటూ బీఆర్ఎస్కు కోవర్టులుగా పనిచేయాలని వారిని ఆదేశించినట్లు చెప్పారు. వారు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ గులాబీ పార్టీకే పని చేస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ కార్పొటేర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లారెడ్డి చెప్పారు. తిరిగి సొంతగూటికి వచ్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. పాత కాంగ్రెస్ నాయకులతో తమకు పొసగడం లేదని, తిరిగి బీఆర్ఎస్లోకి వస్తామంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సైతం సమర్ధించడం ఒకింత ఊతమిచ్చింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఏమంటుందో చూడాలి.
'బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి నేనే పంపించా. కాంగ్రెస్‌లో కోవర్టుగా ఉండి బీఆర్ఎస్కు పనిచేయాలని చెప్పా. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బాధలు, ఇబ్బందులే ఉన్నాయి. రోజూ వాళ్లందరూ ఫోన్ చేస్తున్నారు. మేం వస్తాం ఉండలేకపోతున్నాం అని అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ వరకు అందులోనే ఉండడండి అని నేను చెప్పా'- మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Malla Reddy on Etela Rajender :గత నెల 26న కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు చర్చనీయాంశంగా మారాయి. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్యే గెలుస్తారని అనడంతో ఒక్కసారిగా గులాబీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. ఆరోజు ఓ వేడుకకు వెళ్లిన మాజీ మంత్రి, అక్కడే ఉన్న ఈటల రాజేందర్‌ను కలిశారు. అనంతరం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాసేపు లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలతో ఈ ఎన్నికల్లో నువ్వే గెలుస్తావు అని అన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియో కొన్నిరోజులు నెట్టింట వైరల్‌గా మారింది.
వారిని నేనే చెప్పి మరీ కాంగ్రెస్‌లోకి పంపించా : మాజీ మంత్రి మల్లారెడ్డి (Etv Bharat) 'జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పా- మరోలా దుష్ప్రచారం చేస్తున్నారు' ఈటలతో సమావేశంపై మల్లారెడ్డి స్పందన - Malla Reddy responds on Etela