AP Deputy CM Pawan Kalyan Grama Sabha:పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే అని కొనియాడారు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో 'గ్రామసభ' చాలా ముఖ్యమని తెలిపారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని చెప్పారు. పార్టీ కోసం పని చేసేందుకు ముందుకొచ్చే వారిని తాను వదలుకోనని, మనుషులను కలుపుకొనే వ్యక్తినని, విడగొట్టేవాణ్ని కాదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు.
"ప్రజల కోసం కూలీ మాదిరిగా పని చేసేందుకు తాను సిద్ధం. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటానని, అండగా ఉంటాను. పదవి అనకు అలంకారం కాదు. బాధ్యతగా ఉంటాను. తానెప్పుడు పని చేసేందుకే సిద్ధంగా ఉంటాను. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు. అవసరమైన వారి కోసం గూండా యాక్టు కూడా తీసుకువస్తాము. గ్రామాల్లో కళాశాలలు, క్రీడా మైదానాలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అవుతుంది. దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాను."- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
రాయలసీమ నుంచి వలసలు నివారించి, ఉపాధి అవకాశాలు పెంచుతామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వలసలు ఆగడానికి స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ తీసుకొస్తామన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తు తరం నాయకులు తయారుకావడానికి పంచాయతీలే పట్టుగొమ్మలని తెలియజెప్పారు. పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు కల్పించుకుంటే తప్ప గ్రామపంచాయతీలు మారవని స్పష్టంగా చెప్పారు.