Bhatti Vikramarka Fires On BJP :రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ నేతలు 400 సీట్లు కోరుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని, వాటి ద్వారానే ఎస్సీలు, గిరిజనులకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. సంపద, వనరులు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే నలిగిపోతోందని, జనాభా దామాషా ప్రకారం ప్రజలు వనరులు పొందలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి అని తెలిపారు.
Bhatti Slams BJP Over Reservations Issue :కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు సమానంగా పంచుతామన్న ఆయన కులగణన చేపడతామని రాహుల్ చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణనపై విధాన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి కాంగ్రెస్ పునాదులే కారణమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా బలహీనవర్గాలు పోరాటం చేయాలని కోరారు.
"ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు. దేశంలో 90 శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు బీజేపీ కుట్ర. హక్కులు కాపాడుకునేందుకు ఓటు ద్వారా కాంగ్రెస్‌ను నిలబెట్టుకోవాలి. బీజేపీకి ఓటు వేస్తే ప్రజలకు భవిష్యత్తు లేకుండా పోతుంది. బీజేపీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. దేశం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ నటిస్తోంది. దేశ సంపదను కొందరికి కట్టబెడుతూ ప్రజలను బానిసలుగా చేసేందుకు యత్నం." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి