Deputy Cm Bhatti Vikramarka on New Electricity policy :త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుదుత్పత్తికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందరూ వద్దంటున్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కట్టిందని మండిపడ్డారు. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాము అధికారంలోకి రాగానే ఆర్థికరంగం గురించి శ్వేతపత్రం ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఆర్థిక విషయాల గురించి తాము ఏమీ దాయలేదని, విద్యుత్ రంగం గురించి చాలా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తాము సమర్థంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు. గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు గుర్తించినట్లు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారం అంతా ప్రజలకు చెప్పామని పేర్కొన్నారు.
'అన్ని రకాల విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 39 వేలకు పైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ కింద రూ.199 కోట్లు ఖర్చు చేశాం. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ దిశగా విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నాం. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నాం'- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.52 వేల కోట్లు అప్పు :పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్‌ఎస్ నేతల పని అని విమర్శించారు. మీరు(బీఆర్‌ఎస్) మొత్తం రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశామని వెల్లడించారు. చేసిన అప్పులను తిరిగి బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చారని వ్యాఖ్యానించారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని, రైతుభరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలకు నిధులు కేటాయించామని తెలిపారు.