16th Central Finance Commission Meeting in Hyderabad : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించే వెసులుబాటు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసాన్ని డిప్యూటీ సీఎం పలు అంశాలను ప్రస్తావించారు.
స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం వాటాను 41శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయని అన్నారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని, ఫలితంగా కేంద్ర ప్రాయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.
కీలక దశల్లో తెలంగాణ వేగంగా అడుగులు : రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆర్థిక సంఘాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కీలక దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తుందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6.85 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతం అవుతోందని వివరించారు. సెస్‌లు, సర్ఛార్జీలల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కోరారు.